కారులో ఎయిర్ బ్యాగ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం
center key decision on airbags in car. కేంద్ర ప్రభుత్వం, ఇకపై కారు ముందు వరుస సీట్లకు ఎయిర్ బ్యాగ్స్‌ను తప్పనిసరి చేయనుంది.
By Medi Samrat Published on 5 March 2021 10:07 AM IST
ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రతి రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత జగ్రత్తగా వెళ్తున్నా..ప్రతి రోజు ఏదో విధంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కారు ప్రయాణాన్ని మరింత సేఫ్‌గా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని అమలులోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఇకపై కారు ముందు వరుస సీట్లకు ఎయిర్ బ్యాగ్స్‌ను తప్పనిసరి చేయనుంది.
ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించగా.. వాటిని న్యాయ మంత్రిత్వ శాఖ అంగీకరించడంతో పాటు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీనితో ఇక నుంచి డ్రైవర్‌తో పాటు పక్కసీటులో ఉండే ప్రయాణికుడి వైపు కూడా ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి చేయనుంది. ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. దీనిపై అధికారికంగా నోటిఫికేషన్ మరో మూడు రోజుల్లో వెలువడనున్నట్లు తెలుస్తోంది. కాగా, భారత్‌లో ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదని, రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు చేపట్టాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్
కాగా, ఇకపై కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అనే నిబంధనల అమల్లోకి రానుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలకు డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి. దీంతో ప్రమాద సమయంలో డ్రైవర్ తప్పించుకొన్నా.. సహ ప్రయాణికుడి ప్రాణాలు ప్రమాదంలో పడతాడు. దీంతో కేంద్రం రెండు ఎయిర్ బ్యాగ్స్ నిబంధనను తీసుకురానుంది.