మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని, ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తెలియజేశామని కేంద్ర హోంశాఖ శుక్రవారం రాత్రి తెలిపింది.
"మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన వాస్తవాలు" అనే శీర్షికతో అర్థరాత్రి విడుదల చేసిన మంత్రిత్వ శాఖ.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నుండి మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వానికి అభ్యర్థన వచ్చిందని తెలిపింది.
కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఖర్గే, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తుందని తెలియజేశారు. ఈలోగా దహన సంస్కారాలు, ఇతర లాంఛనాలు జరుగుతాయి.. ఎందుకంటే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి స్థలం కేటాయించాల్సి ఉంటుంది.. అని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి సారథ్యం వహించి, ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూశారు. ఆయన 2004-2014 మధ్య 10 సంవత్సరాల పాటు భారత ప్రధానిగా ఉన్నారు.
ఇదిలావుంటే.. మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలు, స్మారక చిహ్నం కోసం స్థలం కనుగొనకపోవడం దేశ మొదటి సిక్కు ప్రధానమంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని కాంగ్రెస్ శుక్రవారం పేర్కొంది.
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని హోం మంత్రిత్వ శాఖ చెప్పడంతో పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించే ప్రదేశంలో సింగ్ అంత్యక్రియలను నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని చెప్పారు.