అందుకే ఆ సీబీఐ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు
CBI officer died by suicide as he was pressured to frame me. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 5 Sep 2022 10:59 AM GMTఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులో తనను ఇరికించమని ఒత్తిడి రావడం వల్లనే సీబీఐ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఆ అధికారులు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేలా వారిపై ఎందుకు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గత నెలలో సిసోడియా నివాసంతోపాటు ఆయన బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగమైన సీబీఐ అధికారి జితేంద్ర కుమార్, గత గురువారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 'నన్ను తప్పుడు కేసులో ఇరికించాలని సీబీఐ అధికారిపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు' అని మనీష్ సిసోడియా ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి స్టింగ్ ఆపరేషన్ వీడియోను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ఈ స్టింగ్ వీడియో ఈ కేసులో 12వ నిందితుడైన సన్నీ మార్వా తండ్రి కుల్విందర్ మార్వాకు సంబంధించినది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సీబీఐ కేసు నమోదు చేసింది. బీజేపీ నేత సంబిత్ పాత్రా ఈ స్కామ్ కు సంబంధించిన స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేశారు. 'ఇప్పుడు మీకు తప్పించుకునే మార్గం లేదు మనీష్ జీ' అంటూ సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఎక్కడ అవినీతి ఉన్నా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే జరిగినట్టు చెప్పారు.