డేరా బాబా.. ఇంకో అరాచకంలో దోషిగా తేల్చేశారు

CBI court convicts Dera chief Ram Rahim, others in murder case. డేరాబాబా.. ఆశ్రమం పేరుతో చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ.. ఇన్నీ కావు.

By Medi Samrat  Published on  8 Oct 2021 11:17 AM GMT
డేరా బాబా.. ఇంకో అరాచకంలో దోషిగా తేల్చేశారు

డేరాబాబా.. ఆశ్రమం పేరుతో చేసిన అరాచకాలు, దారుణాలు అన్నీ.. ఇన్నీ కావు. కథలు కథలుగా చెప్పుకొన్నారు. ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులోనూ కోర్టు అతడిని 2019లో దోషిగా ప్రకటించింది. భక్తి ముసుగులో మహిళలను సెక్స్ బానిసలుగా మార్చాడు. ఎంతో మంది మగవారిని నపుంసకులుగా మార్చి తన దారుణాలకు వారిని అడ్డం పెట్టుకున్నాడు.

2002 జులై 10 నాటి హత్య కేసుపై ఇవాళ తీర్పును సీబీఐ కోర్టు వెలువరించింది. 2002లో డేరా సచ్చా సౌధలో తన అనుచరుడైన రంజీత్ సింగ్ హత్యకు గురయ్యాడు. రంజీత్ సింగ్ కుమారుడు జగ్షీర్ సింగ్ ఫిర్యాదు మేరకు 2003 డిసెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సీబీఐ కోర్టు విచారిస్తోంది. ఆ కేసును వేరే సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను రెండు రోజుల క్రితం న్యాయమూర్తులు కొట్టేశారు. తాజాగా పంచకులలోని సీబీఐ కోర్టు కేసులో తీర్పును వెలువరించింది. డేరా బాబాతో పాటు మరో ఐదుగురు అనుచరులను దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ నెల 12న శిక్షను విధించనుంది.

డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురయ్యారు. రంజిత్ హత్యకు డేరా బాబా సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్‌లు కుట్ర పన్నినట్టు తేల్చింది. డేరాలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని గుర్మీత్ రామ్ రహీమ్ చేస్తున్న అరాచకాలను బయట ప్రపంచానికి తెలియజెప్పడానికి అజ్ఞాత వ్యక్తి పేరుతో లేఖ రాసినట్టు రంజిత్ సింగ్‌ను అనుమానించి చంపేశారు. ఇదే లేఖను సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హైలట్ చేశారు. ఆయన కూడా హత్యకు గురయ్యారు.


Next Story
Share it