జమ్మూ కాశ్మీర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ల నియామకానికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం బీఎస్ఎఫ్ కమాండెంట్‌ను అరెస్టు చేసింది. అధికారికంగా ఎటువంటి సమాచారం లేనప్పటికీ, పట్టుబడిన BSF అధికారిని జమ్మూ నగర శివార్లలో ఉన్న పాలౌరాలోని BSF ఫ్రాంటియర్స్ హెడ్‌క్వార్టర్స్‌లో వైద్య అధికారి డాక్టర్ కర్నైల్ సింగ్ అని కథనాలు వస్తున్నాయి. సిబిఐ అధికారుల విచారణలో సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో ఆయనను బుధవారం అరెస్టు చేశారు, అతని అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని సీనియర్ బిఎస్ఎఫ్ అధికారులకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో ఆగస్టు 3న సీబీఐ కేసు నమోదు చేసినప్పటి నుంచి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మిగతా ఎనిమిది మందిలో J&K పోలీస్ సెలక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ రామన్ శర్మ, ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఇండియా రిజర్వ్ పోలీస్ సిబ్బంది, మాజీ CRPF సిబ్బంది, ఇద్దరు అఖ్నూర్ నివాసితులు, హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వివిధ రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలలో దాడులు నిర్వహించిన సిబిఐ.. J&K స్టేట్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (J&KSSRB) సెక్షన్ ఆఫీసర్, ఒక ప్రైవేట్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ యజమానితో సహా 33 మందిపై కేసు నమోదు చేసింది.