కర్ణాటకలోని హసన్ జిల్లాలోని ఓ గ్రామంలో అనుమతి లేకుండా 120 చెట్లను నరికి కలపను అక్రమంగా తరలించారని ఆరోపణలపై బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహ సోదరుడు విక్రమ్‌సింహపై కేసు నమోదైంది. ప్రతాప్ సింహా ఇటీవల లోక్‌సభ హాలులో సెక్యూరిటీని దాటిన ఇద్దరు వ్యక్తులకు విజిటర్ పాస్‌లు ఇచ్చారనే కారణంతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సోదరుడు చెట్లను నరికివేసిన కేసులో ఇరుక్కున్నారు.
విక్రమ్ సింహ కేసులో.. నందగొండనహళ్లి గ్రామంలో అధికారుల నుండి అనుమతి లేకుండా చెట్లను నరకడం, కలప అక్రమ రవాణా ఆరోపణలపై రాష్ట్ర అటవీ శాఖ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తహసీల్దార్ మమత గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ కలప అక్రమ రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలుసుకున్న ఆమె, అధికారులను అప్రమత్తం చేసి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించారు. చెట్లను నరికిన అటవీ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. 12 ఎకరాలలో విస్తరించిన ఈ భూమిని పశుగ్రాసం కోసం ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మాట్లాడుతూ విక్రమ్ సింహా 15 రోజులకు పైగా ఈ చెట్లను నరికివేసే కార్యక్రమంలో భాగమయ్యారని ఆరోపించారు. అతనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.