మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత సంవత్సరం పార్లమెంట్‌లో మూడు నూతన వ్యవసాయ చట్టాలు ఆమోదించబడ్డాయి. అప్పటి నుండి ఢిల్లీ శివారులలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తూ వచ్చారు. దీంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఇటీవల జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించిన సమయంలో.. మూడు వ్యవసాయ చట్టాల బిల్లులను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని ప్రధాని కోరారు.
ఈ క్రమంలోనే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ముసాయిదా చట్టాన్ని కేంద్రం ప్రభుత్వం రూపొందించింది. దీనికి ఇవాళ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నవంబర్ 29 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. లోక్‌సభ, రాజ్యసభలలో ఈ బిల్లును ఆమోదిస్తే కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ బిల్లుల రద్దు అవుతాయి. ' ద ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 టు రిపీల్ త్రీ ఫామ్ లాస్' అని లోక్‌సభ చేపట్టబోయే బిజెనెస్ లిస్ట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మొత్తంగా 26 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 25వ అంశంగా ఉన్న వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును తొలి రోజునే ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.