బైపోల్స్ లో విజయాలు సాధించింది ఎవరంటే..?
Bypoll Results 2022 Live Updates. హర్యానాలోని అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్
By Medi Samrat Published on 6 Nov 2022 5:04 PM ISTహర్యానాలోని అదంపూర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ ఘన విజయం సాధించారు. నవంబరు 3న జరిగిన ఈ ఎన్నికకు సంబంధించిన ఓట్లను ఆదివారం లెక్కించారు. ఆయనకు 16 వేల ఓట్ల ఆధిక్యం లభించింది. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనుమడు. ఆయన వయసు 29 సంవత్సరాలు. భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్‌పై ఘన విజయం సాధించారు. భజన్ లాల్ కుమారుడు కుల్‌దీప్ బిష్ణోయ్ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. కుల్‌దీప్ కుమారుడే భవ్య బిష్ణోయ్.
బిహార్‌లోని గోపాల్ గంజ్, మొకామా శాసన సభ నియోజకవర్గాలకు నవంబరు 3న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గోపాల్ గంజ్ నుంచి బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి విజయం సాధించగా, మొకామాలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ సింగ్ మరణించడంతో గోపాల్‌గంజ్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి కుసుమ్ దేవి పోటీ చేసి, విజయం సాధించారు. ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై కుసుమ్ దేవి సుమారు 1,800 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
మొకామా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ సతీమణి నీలం దేవి విజయం సాధించారు. అనంత్ కుమార్ సింగ్‌పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. నీలం దేవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోనం దేవిపై దాదాపు 16,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.