ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పిన బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన 5 రోజులకు కొట్టుకుపోయింది. గత శనివారం బుందేల్‌ఖండ్ పరిధిలోని జలాన్‌లో అట్టహాసంగా ఏర్పాటు చేసిన వేదిక మీద మోదీ ఈ జాతీయ రహదారిని ప్రారంభించారు. బుందేల్‌ఖండ్ పరిధిలోని ఏడు జిల్లాల మీదుగా సాగే ఈ రహదారితో ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని, తత్ఫలితంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆ సందర్భంగా మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో కురిసిన వర్షానికి.. ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా చాలా ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొరలింది. ఈ కారణంగా జాతీయ రహదారిపై ఓ చోట మొత్తం రోడ్డు కొట్టుకుపోయి.. ఖాళీ ఏర్పడింది.
ఈ దృశ్యాన్ని సీనియర్ జర్నలిస్ట్ రన్‌విజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. మోదీ ప్రారంభించిన హైవే 5 రోజులకే ఇలా కొట్టుకుపోయిందంటూ ఆయన ఓ కామెంట్‌ను దానికి జత చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలల ప్రాజెక్టు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే అత్యంత వేగంగా నిర్మించబడింది. జూలై 16న జలౌన్ కైత్రీ టోల్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను బటన్‌ను నొక్కడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్ నుండి ప్రారంభమవుతుంది. ఇటావాలోని ఢిల్లీ హైవేకి అనుసంధానించబడి ఉంది. 296 కి.మీ పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే కేవలం 28 నెలల్లో నిర్మించారు.