మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మొబైల్ బ్యాటరీ పేలడంతో 12 ఏళ్ల బాలుడు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. చిన్నారి రోడ్డుపై పడి ఉన్న మొబైల్ బ్యాటరీని ఇంటికి తీసుకుని వచ్చాడు. దాన్ని ఎలాగైనా పని చేయించాలని ప్రయత్నం చేశాడు. పిల్లవాడు ఒక పాయింట్ నుండి మరో పాయింట్‌కి వైర్‌ను జోడించిన వెంటనే ఆ బ్యాటరీ కాస్తా పెద్ద శబ్దంతో పేలింది. పేలుడు చాలా బిగ్గరగా ఉండటంతో బ్యాటరీ ముక్క అతని కాలేయంలోకి ప్రవేశించింది. ఊపిరితిత్తులు, చేతులు, కాళ్లు, నోరు, కడుపు మరియు ఛాతీపై కూడా తీవ్ర గాయాలయ్యాయి.
బాధిత పిల్లాడిని హసీం ఖాన్ కుమారుడు అఫ్జల్ గా గుర్తించారు. అతను కుర్రహ గ్రామానికి చెందినవాడు. సెలవులను గడిపేందుకు తల్లితో కలిసి మేనమామ ఇంటికి వెళ్లాడు. శుక్రవారం నాడు రోడ్డుపై పడి ఉన్న మొబైల్ బ్యాటరీని ఇంటికి తీసుకుని వచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అది పేలడంతో పిల్లాడికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం అఫ్జల్‌ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. బ్యాటరీ ముక్క కాలేయంలోకి చేరిందని, దీంతో చాలా రక్తస్రావం అవుతోందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల్లోకి కూడా ఓ ముక్క చేరిందని వైద్యులు చెబుతున్నారు. అఫ్జల్‌కు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. పిల్లలు వీటితో ఆడుకుంటూ ఉన్నారు.. ఏమేమి చేస్తూ ఉన్నారు అనే విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.