రాంచీలో భారీ పేలుడు..!
కేరళలోని కలమసేరిలో ఆదివారం వరుస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
By Medi Samrat Published on 29 Oct 2023 6:05 PM ISTకేరళలోని కలమసేరిలో ఆదివారం వరుస బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే జార్ఖండ్ రాజధాని రాంచీలో కూడా భారీ పేలుడు సంభవించింది. అయితే ఈ రెండు ఘటనల మధ్య ఎలాంటి సంబంధం లేదు. రాంచీలో పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. చెత్త కుప్పలో పేలుడు సంభవించినట్లు విచారణలో తేలింది. పేలుడు శబ్ధం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
సమాచారం ప్రకారం.. రాంచీలోని నామ్‌కుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదాబహార్ చౌక్ ప్రాంతంలోని ఓ వీధిలో ఉన్న చెత్త కుప్పలో పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో అక్కడ ఉన్న క్లీనింగ్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన సఫాయిని బంటీగా గుర్తించారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు.. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ తో ఘటనాస్థలికి చేరుకున్నారు. అన్ని బృందాలు విచారణలో నిమగ్నమై ఉన్నాయని జిల్లా ఎస్పీ మింజ్ మీడియాకు తెలిపారు.
అయితే ఘటనా స్థలం నుంచి పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంకా లభించలేదు. పేలుడు చాలా శక్తివంతమైనదని.. దాని శబ్దం రెండు కిలోమీటర్ల వరకూ వినిపించిందని నివేదికలో చెప్పబడింది. పక్కనే ఉన్న ఇళ్లకు కూడా భారీ నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.