పార్లమెంట్ లో ఫ్లైయింగ్ కిస్ రగడ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో వివాదం చెలరేగింది. ఆయన గాల్లోకి వదిలిన ఓ ఫ్లైయింగ్ కిస్
By Medi Samrat Published on 9 Aug 2023 11:46 AM GMTకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో వివాదం చెలరేగింది. ఆయన గాల్లోకి వదిలిన ఓ ఫ్లైయింగ్ కిస్ పై బీజేపీ మహిళా ఎంపీలంతా కలిసి స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. రాహుల్‌పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. 21 మంది బీజేపీ మహిళా ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అవిశ్వాస తీర్మానంపై రాహుల్‌గాంధీ సభలో మాట్లాడుతూ అసభ్యంగా ప్రవర్తించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విమర్శించారు. స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. నేనో విషయాన్ని ఖండిస్తున్నాను. పార్లమెంట్‌లో మాట్లాడేందుకు రాహుల్‌కి అవకాశమిస్తే వెళ్లిపోయే ముందు అభ్యంతరకరంగా ప్రవర్తించారని అన్నారు. ఆడవాళ్లను గౌరవించని వాళ్లే ఇలా ప్రవర్తిస్తారు. మహిళా ఎంపీలు కూర్చున్న వైపు చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారన్నారు. పార్లమెంట్‌లో ఓ ఎంపీ ఇలా చేయడం మన దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేదని అన్నారు. ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్న రాహుల్‌గాంధీ మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం దారుణమన్నారు స్మృతి ఇరానీ. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింభిస్తుందని.. గాంధీ కుటుంబంలోని వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తారని మండిపడ్డారు స్మృతి ఇరానీ. రాహుల్ ప్రవర్తన రోడ్డు మీద పోకిరీల లాగా ఉందన్నారు.
రాహుల్ గాంధీ లోక్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.. మణిపూర్ రిలీఫ్ క్యాంపులో ఉన్న మహిళలతో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. మణిపూర్ బాధితుల గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. తన కళ్లముందే తన కొడుకును చంపారని ఓ బాధిత మహిళ చెప్పిందన్నారు. దేశాన్ని హత్య చేస్తున్నారన్నారు. మణిపూర్ లో భారతమాతను చంపేశారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మీరు దేశ భక్తులు కాదు, దేశ ద్రోహులంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.