కర్ణాటకలో వాతావరణం పార్టీకి అనుకూలంగా ఉన్నందున రానున్న రోజుల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఆదివారం విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ కర్నాటక విభాగంలో పెరుగుతున్న విభేదాలపై, పార్టీ సభ్యులందరూ కలిసి పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప పిలుపు నిచ్చారు. బీజేపీకి వాతావరణం చాలా అనుకూలంగా ఉందని, రాబోయే రోజుల్లో కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి వస్తామని 100 శాతం నమ్మకం ఉందని అన్నారు. అందరం కలిసి ఈ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.
జర్నలిస్టులతో మాట్లాడిన యడ్యూరప్ప.. ఎలాంటి సూచనలు ఇచ్చే ప్రశ్నే లేదని, ప్రతి సందర్భంలోనూ అందరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. కర్ణాటక బీజేపీలో విభేదాలు తెరపైకి వచ్చాయి. బీజాపూర్ సిటీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి నేతృత్వంలోని ఒక వర్గం.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. యత్నాల్, జార్కిహోళి.. విజయేంద్రను బహిరంగంగానే విమర్శిస్తూ అధికార కాంగ్రెస్‌తో కలసి రాజకీయాలు ఆడుతున్నారని ఆరోపించారు. అయితే యత్నాల్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు యడియూరప్ప నిరాకరించారు.