బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వ‌స్తున్నాడు..!

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని మార్చిలో ఎన్నుకోనుంది

By Medi Samrat  Published on  1 March 2025 4:30 PM IST
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వ‌స్తున్నాడు..!

భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని మార్చిలో ఎన్నుకోనుంది. రాష్ట్రాలు తమ తమ ఎన్నికలను నిర్వహించిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను జనవరిలో పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ప‌లు రాష్ట్ర యూనిట్లలో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నందున, కొత్త అధ్యక్షుడి ఎంపిక ఆలస్యం అయ్యింది.

బీజేపీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అధ్యక్షుని ఎన్నిక కోసం కనీసం 50 శాతం రాష్ట్ర యూనిట్లు తమ తమ అధ్యక్షులను ఎన్నుకోవడం అవసరం. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులతో పాటు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు జాతీయ అధ్యక్షుడి ఎంపికలో కీల‌కం. ప్రస్తుతం 36 రాష్ట్రాల్లో కేవలం 12 రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం మరో ఆరు రాష్ట్రాల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

మరోవైపు బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, హర్యానా వంటి ప్రధాన రాష్ట్రాలలో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు మరో పది రోజుల్లో పూర్తవుతాయని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జిల్లా అధ్యక్షుల ఎన్నిక మరో మూడు-నాలుగు రోజుల్లో పూర్తవుతుందని, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని భావిస్తున్నారు. వారం, పది రోజుల్లో ఉత్తరప్రదేశ్‌కు కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పదవి వస్తుందని భావిస్తున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.

ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయ‌న‌ మొదట జూన్ 17, 2019న బీజేపీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. జనవరి 20, 2020 వరకు ఆ పదవిలో ఉన్నారు. దీని తరువాత జనవరి 20, 2020 న, ఆయ‌న‌ అధికారికంగా పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఆయ‌న‌ ఈ పదవిని నిర్వహిస్తున్నాడు.

జేపీ నడ్డా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 35 రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేసి 16 రాష్ట్రాల్లో విజయం సాధించడం గమనార్హం. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చింది.

Next Story