గాంధీనగర్ మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. విజయమంటే అలాంటి.. ఇలాంటిది కాదు.. క్లీన్ స్వీప్. మొత్తం 44 స్థానాలున్న గాంధీ నగర్ మున్సిపాలిటీలో బీజేపీ 41 స్థానాలు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ రెండు స్థానాలు, ఆప్ ఒక స్థానం గెలుచుకున్నాయి. గాంధీనగర్ మున్సిపాలిటీలోని 11 వార్లుల్లో ఉన్న 44 స్థానాలకు 162 అభ్యర్థులు పోటీకి దిగారు. ఆదివారం పోలింగ్ జరగ్గా మంగళవారం లెక్కింపు చేపట్టారు. బీజేపీ విజయంతో ఆ పార్టీలో ఆనందం వెల్లివిరిసింది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
గుజరాత్ భారతీయ జనతా పార్టీ అధినేత సీఆర్ పాటిల్ మాట్లాడుతూ బీజేపీ నేతలకు ప్రజలతో క్షేత్ర స్థాయిలో ఎంతటి అనుబంధం ఉందో ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని అన్నారు. ఆప్‌ను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై గుజరాత్ ప్రజలకు ఉన్న విశ్వాసం ఈ ఫలితాలతో మరోసారి రుజువైందని అన్నారు. గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (జిఎంసి) ఎన్నికల్లో బీజేపీకి విజయం అందించినందుకు గుజరాత్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ బీజేపీ చీఫ్ సిఆర్ పాటిల్‌ను కూడా నడ్డా అభినందించారు.