48 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ
BJP releases list of 48 candidates. రానున్న త్రిపుర ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను
By Medi Samrat Published on 28 Jan 2023 8:36 AM GMTరానున్న త్రిపుర ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రంలోని 60 అసెంబ్లీ స్థానాలకు గాను.. 48 మందితో అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్ సాహా టౌన్ బోర్దోవలి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. మిగిలిన 12 మంది అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్.. ధనపత్ నియోజకవర్గం నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ప్రతిమా భౌమిక్.. కేంద్ర మంత్రిగా ఉన్నారు.
బీజేపీ నేతలు అనిల్ బలూనీ, సంబిత్ పాత్ర శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. మూడు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఫిబ్రవరి 16న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు సీట్ల వారీగా చర్చలు జరిగాయి.
60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీకి ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల దాఖలుకు జనవరి 30 చివరి తేదీ. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 25 ఏళ్ల పాలనకు ముగింపు పలికి.. 2018లో తొలిసారిగా త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికలలో 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 36 సీట్లు గెలుచుకుంది.