యూపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుద‌ల చేసిన‌ బీజేపీ.. ఉచిత కరెంటు, ఉచిత స్కూటీలు, ఉచిత ప్రయాణం.. వ‌రాల జ‌ల్లు అంతే..

BJP releases its election manifesto for UP election 2022. 'లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్ర' పేరుతో యూపీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుద‌ల చేసింది.

By Medi Samrat  Published on  8 Feb 2022 2:15 PM IST
యూపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుద‌ల చేసిన‌ బీజేపీ.. ఉచిత కరెంటు, ఉచిత స్కూటీలు, ఉచిత ప్రయాణం.. వ‌రాల జ‌ల్లు అంతే..

'లోక్ కళ్యాణ్ సంకల్ప్ పత్ర' పేరుతో యూపీ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ విడుద‌ల చేసింది. మంగళవారం ఉదయం అమిత్ షా, ఇతర నాయకుల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, యువతకు పెద్ద‌పీట వేసిన‌ట్లు తెలుస్తోంది. హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, పార్టీ చీఫ్ సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయ‌బ‌డింది. ఐదేళ్ల క్రితం బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని.. ఇంకా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఐదేళ్లలో యూపీలో అల్లర్లు త‌గ్గాయ‌ని అన్నారు. ప్రతి కూతురూ నిర్భయంగా బడికి వెళుతున్నార‌ని.. మ‌హిళ‌లు బయటకు వెళ్లేందుకు ఏ మాత్రం వెనుకాడట్లేద‌ని అన్నారు.

యూపీలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. వచ్చే ఐదేళ్లలో రైతులకు సాగునీటికి ఉచిత కరెంటు ఇస్తామని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. రూ.5 వేల కోట్లతో ముఖ్యమంత్రి కృషి సించాయి యోజనను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీని కింద చిన్న, సన్నకారు రైతులందరికీ బోర్‌వెల్, గొట్టపు బావి, చెరువు, ట్యాంకుల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన కింద ఆర్థికసాయం 15 వేల నుంచి 25 వేలకు పెంచుతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల పథకం కింద హోలీ, దీపావళి నాడు లబ్దిదారులందరికీ ఉచితంగా ఎల్‌పిజి సిలిండర్లు అందజేస్తామన్నారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ప్రజా రవాణాలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వితంతువులు, నిరుపేద మహిళలకు నెలకు రూ.1500ల‌కు పింఛను పెంచుతామని హామీ ఇచ్చారు. కాలేజీకి వెళ్లే ప్రతిభావంతులైన బాలికల స్వావలంబనకు.. రాణి లక్ష్మీ బాయి పథకం కింద ఉచిత స్కూటీలను పంపిణీ చేస్తామని చెప్పారు.

రాబోయే 5 సంవత్సరాలలో ప్రతి కుటుంబానికి కనీసం ఉపాధి లేదా స్వయం ఉపాధి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగ‌ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద యువ సశక్తికరణ్ యోజన కింద.. 2 కోట్లు టాబ్లెట్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో జిమ్‌లు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానానికి తీసుకువస్తామని హామీ ఇస్తూ.. ప్రతి వ్యక్తి ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు సంకల్పించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తామని హామీ ఇచ్చారు.


Next Story