లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మృతిని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను ఆదివారం వాయిదా వేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10.15 గంటలకు మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరగాల్సి ఉండగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ దీనికి తరలివచ్చారు.
''లతా మంగేష్కర్ మరణం కారణంగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలను వాయిదా వేస్తున్నాం. విడుదలకు తదుపరి తేదీని తర్వాత నిర్ణయిస్తాము,'' అని స్వతంత్ర దేవ్ సింగ్ చెప్పారు. లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా బీజేపీ కార్యాలయంలో నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇదిలావుంటే.. లతా మంగేష్కర్ (92) ఆదివారం ముంబై ఆసుపత్రిలో మరణించారు. 29 రోజులు పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దేశ, విదేశాలలో కలిపి దాదాపు 20 బాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు.