ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ మేయర్, సీనియర్ బీజేపీ నేత వినోద్ అగర్వాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో రక్తదానం చేస్తున్నట్లు నటించి అడ్డంగా బుక్ అయ్యాడు. అతడు రక్తం ఇస్తున్నట్లు నటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన సెప్టెంబర్ 17న స్థానిక బీజేపీ కార్యాలయంలో జరిగింది.
మేయర్ రక్తదాన శిబిరంలో మంచంపై పడుకున్నట్లు వీడియో చూపిస్తుంది. ఒక ఆరోగ్య సంరక్షణ కార్యకర్త ఆయన బీపీని తనిఖీ చేయాలని ప్రయత్నించాడు. అయితే అందుకు బీజేపీ నాయకుడు ఒప్పుకోలేదు. బీపీ చెకింగ్ లాంటి ప్రక్రియను కొనసాగించవద్దని డాక్టర్‌ని కోరాడు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది సూదిని బయటకు తీస్తుండగా, మేయర్ అకస్మాత్తుగా మంచం మీద నుండి లేచి గది నుండి వెళ్ళిపోయాడు. వీడియో వైరల్ అయిన వెంటనే, సోషల్ మీడియా వినియోగదారులు అగర్వాల్ ఫోటోల కోసం రక్తదానం చేసినట్లుగా ఫోజులు ఇచ్చారని విమర్శించారు.
వైరల్ వీడియో గురించి వినోద్ అగర్వాల్ ను ప్రశ్నించగా, తన పరువు తీసేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్ర అని పేర్కొన్నారు. తాను రక్తదానం చేసేందుకు శిబిరానికి వెళ్లానని, అయితే తనకు డయాబెటిక్ ఉందని డాక్టర్ కు చెప్పగా.. ఆయన వద్దని చెప్పడంతో తాను దానం చేయలేకపోయానని అగర్వాల్ వివరించారు.