మేయర్ సీటు బీజేపీకే.. ఆప్ తీవ్ర ఆరోపణలు
BJP councillor Sarabjit Kaur Dhillon wins Chandigarh mayor polls, AAP cries foul. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును
By Medi Samrat Published on 9 Jan 2022 5:46 PM ISTచండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. 35 వార్డులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దిగినా అత్యధికంగా 14 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 12 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, శిరోమణి అకాలీదళ్ కేవలం ఒకే ఒక్క చోట గెలిచింది. మేయర్ స్థానం కోసం శనివారం జరిగిన ఓటింగ్ రసవత్తరంగా సాగింది. ఓటింగ్ సమయంలో ఒక శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్, ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో 35 సీట్లున్న నగర కార్పొరేషన్‌లో మేయర్ స్థానానికి జరిగిన ఓటింగ్‌లో సాధారణ మెజారిటీ 14కు పడిపోయింది. చండీగఢ్ ఎంపీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎక్స్–అఫీషియో సభ్యుడి హోదాలో ఓటింగ్‌లో పాల్గొని బీజేపీకి మద్దతిచ్చారు. ఒక కాంగ్రెస్ సభ్యుడు బీజేపీ చెంతకు చేరడంతో ఆప్, బీజేపీ చెరో 14 మంది సభ్యులతో సమంగా నిల్చాయి.
శనివారం మేయర్ ఎన్నికలో ఒక ఆప్ సభ్యుని ఓటు చెల్లదని తేల్చడంతో మేయర్ పీఠం బీజేపీ వశమైంది. మహిళా కౌన్సిలర్ సరబ్‌జిత్ కౌర్ ధిల్లాన్ మేయర్‌గా గెలిచారు. దీంతో బీజేపీపై ఆమ్ఆద్మీ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని ఆరోపిస్తూ ఆప్ ఓ ట్వీట్ వేసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించినా, అక్కడి కలెక్టర్ చట్ట వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థి సరబ్‌జిత్ కౌర్‌ను మేయర్‌గా ప్రకటించారని విమర్శించింది. తమ పార్టీకి చెందిన సీనియర్లు కలెక్టర్ ఆఫీసు దగ్గరే వేచి చూస్తున్నా, వారిని కలవడానికి కూడా కలెక్టర్ నిరాకరించారని ఆప్ ఆరోపించింది.