వినేష్ ఫోగట్‌పై పోటీకి బీజేపీ ఎవరిని నిలబెట్టిందో తెలుసా.?
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది
By Medi Samrat Published on 10 Sept 2024 5:51 PM ISTహర్యానా అసెంబ్లీ ఎన్నికలకు 21 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. జులనా స్థానం నుంచి బీజేపీ యువకుడు, కొత్త ముఖాన్ని ఎన్నికల బరిలోకి దించింది. జులనా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై బీజేపీ కెప్టెన్ యోగేష్ బైరాగిని బరిలోకి దింపింది. కెప్టెన్ యోగేష్ బైరాగి ఒకటిన్నర సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. ఇంతకు ముందు ఎయిర్ ఇండియాలో సీనియర్ కెప్టెన్‌గా పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోదీని తన ఆరాధ్య దైవంగా భావించిన కెప్టెన్ యోగేష్.. బీజేపీలో చేరి తన రాజకీయ యాత్రను ప్రారంభించాడు.
కెప్టెన్ యోగేష్ బైరాగి వయస్సు 35 సంవత్సరాలు. అతడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. బీజేపీ యువమోర్చా హర్యానా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా. అతని తండ్రి నరేంద్ర కుమార్ బైరాగి. కెప్టెన్ యోగేష్ సఫిడాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పజు కలాన్ గ్రామ నివాసి. అతడికి బీజేపీ అగ్ర నాయకత్వంతో మంచి పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సైనీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
సఫిడాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ను ఆశించినప్పటికీ.. బీజేపీ అక్కడ నుంచి రామ్‌కుమార్ గౌతమ్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది. దీంతో జులనా నుండి కెప్టెన్ యోగేష్‌ను రంగంలోకి దించారు. పార్టీలో కెప్టెన్ యోగేష్ ప్రభావం దృష్ట్యా బీజేపీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జులనా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ వేసిన ఈ అడుగు కీలకంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా వినేష్ ఫోగట్ పోటీ బీజేపీకి సవాలుగా మారిన నేపథ్యంలో.. కెప్టెన్ యోగేష్ బైరాగిని బరిలో దింపి పోటీలో కొత్త ట్విస్ట్ తీసుకురాగలిగింది.