త్రిపుర ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాలకు గాను మూడింటిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయం సాధించింది. త్రిపుర ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు మాణిక్ సాహా టౌన్ బర్దోవాలి నియోజకవర్గం నుండి ఈ ఉప ఎన్నికల్లో 6,104 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతిష్టాత్మకమైన అగర్తల స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ 3,163 ఓట్ల తేడాతో గెలుపొందారు.
త్రిపుర ఉపఎన్నికల్లో టౌన్ బోర్దోవలి, జుబారాజ్‌నగర్, సుర్మా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సీఎం మాణిక్ సాహా విజయంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అప్పటి సీఎం బిప్లబ్ దేబ్ హఠాత్తుగా రాజీనామా చేయడంతో గత నెలలో రాజ్యసభ ఎంపీ మాణిక్ సాహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఈ ఉప ఎన్నికల్లో గెలవాల్సిందే. నిబంధనల ప్రకారం అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.
ఫిబ్రవరిలో ఆశిష్ కుమార్ సాహా బీజేపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత టౌన్ బర్దోవాలి స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. జూన్ 23న అగర్తల, టౌన్ బర్దోవాలి, సుర్మా, జుబరాజ్‌నగర్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.