పంజాబ్ అసెంబ్లీ పోరు : సీట్ల పంపకంపై కీలక ప్రకటన చేసిన నడ్డా..
BJP announces seat-sharing formula. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సోమవారం
By Medi Samrat Published on 24 Jan 2022 7:22 PM ISTరాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సోమవారం తన కూటమి భాగస్వాములతో కలిసి సీట్ల పంపకంపై కీలక ప్రకటన చేసింది. బీజేపీ పార్టీ.. కొత్తగా కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్(పీఎల్‌సీ), సుఖ్ దేవ్ సింగ్ ధిండా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలలో బీజేపీ 65 స్థానాల్లో, పీఎల్‌సీ 37, శిరోమణి అకాలీదళ్ (ఎస్) 15 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
జాతీయవాదం, జాతీయ భద్రత గురించి మాట్లాడుతూ.. పంజాబ్ పాకిస్తాన్‌తో 600 కి.మీ సరిహద్దును పంచుకుంటుందని డ్రగ్స్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్మగ్లింగ్ వంటి దుర్మార్గపు కార్యకలాపాలకు చాలా కాలంగా అడ్డాగా ఉందని నడ్డా అన్నారు. "పంజాబ్ సరిహద్దు రాష్ట్రం.. ఇది దేశ భద్రతకు అనుసంధానించబడి ఉంది. ఇది పంజాబ్ ఎన్నికలకు సంబంధించినంత వరకు చాలా ముఖ్యమైన అంశం" అని ఆయన చెప్పారు. ఎన్‌డీఏ కూటమి కేవలం పాలన మార్పును కోరుకోవడం లేదని.. పంజాబ్‌లో స్థిరత్వాన్ని కోరుకుంటుందని బీజేపీ చీఫ్ అన్నారు. పంజాబ్ సుస్థిరంగా, సురక్షితంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు.
పంజాబ్ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని.. ప్రగతిశీల రాష్ట్రంగా ఉన్నప్పటికీ.. రూ. 3 లక్షల కోట్ల అప్పులలో ఉందని అన్నారు. అందుకే పంజాబ్‌ను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి పంజాబ్‌పై ప్రత్యేక ప్రేమ, బంధం ఉందన్నారు. డిసెంబర్ 26న వీర్ బల్ దివాస్ గా జరుపుకుంటామని ప్రకటించారు. ప్రధాని మోదీ సిక్కుల కోసం పనిచేశారని గుర్తుచేశారు. 120 కోట్ల పెట్టుబడితో కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించామని నడ్డా తెలిపారు. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొదట ఫిబ్రవరి 14న జరగాల్సి ఉండగా.. రాజకీయ పార్టీల అభ్యర్థన మేరకు షెడ్యూల్‌ను ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.