బీహార్‌కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట.!

ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున బీహార్‌కు కేంద్ర బడ్జెట్ 2025లో పెద్ద పీట లభించింది.

By Medi Samrat  Published on  1 Feb 2025 4:22 PM IST
బీహార్‌కు లక్కీ ఛాన్స్.. కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట.!

ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నందున బీహార్‌కు కేంద్ర బడ్జెట్ 2025లో పెద్ద పీట లభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీహార్ రాష్ట్రంలో మఖానా బోర్డు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటును ప్రతిపాదించారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ), బీజేపీల హయాంలో కొనసాగుతున్న బీహార్‌లో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

సీతారామన్ తన ఎనిమిదో వరుస బడ్జెట్‌ను సమర్పిస్తూ 'సూపర్‌ఫుడ్' గా పేరుగాంచిన మఖానాను పండించే రైతులకు సహాయం చేయడానికి 'మఖానా బోర్డు'ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సీతారామన్ పాట్నా విమానాశ్రయం విస్తరణ, నాలుగు కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, బిహ్తాలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి, రాష్ట్రానికి మౌలిక సదుపాయాల ప్రోత్సాహం లభించింది. తూర్పు ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించడానికి బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటును కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో పశ్చిమ కోసి కెనాల్ ERM ప్రాజెక్ట్ కోసం సీతారామన్ ఆర్థిక సహాయాన్ని ప్రతిపాదించారు, బీహార్‌లో 50,000 హెక్టార్లకు పైగా భూమిని సాగు చేస్తున్న అనేక మంది రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐఐటీని కూడా విస్తరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

Next Story