పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ ప్రధాని నుంచి భారీ గిఫ్ట్ వచ్చింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా 600 కిలోల మామిడి పండ్లను మమతకు బహుమతిగా పంపారు. మమతకు షేక్ హసీనా పంపిన పండ్లలో పలు రకాల మామిడిపండ్లు ఉన్నాయని అంటున్నారు. దౌత్యపరమైన సంబంధాల్లో భాగంగా ఈ గిఫ్ట్‌ను అందజేశారు. గత ఏడాది కూడా పండ్లను పంపారని తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు మమిడి పండ్లను బహుమతిగా హసీనా పంపారని అంటున్నారు.
ఇక కొద్దిరోజుల కిందట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. హింసాగర్, లాంగ్రా, లక్ష్మణ్ భోగ్, ఫజ్లీతో సహా వివిధ రకాల మామిడి పండ్లను ప్రధాని నివాసం, ఇతర ప్రముఖులకు పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి కార్యాలయం, భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు ఈ మామిడిపండ్లను పంపినట్లు సమాచారం. గత ఏడాది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లకు మమతా బెనర్జీ మామిడి పండ్లను పంపారు. 2011లో తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రారంభించిన సంప్రదాయాన్ని మమతా బెనర్జీ కొనసాగిస్తున్నారు.