వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లోని విపక్ష సభ్యులందరినీ జనవరి 24, శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు. వారు చేస్తున్న నిరసనల కారణంగా చైర్మన్ జగదాంబిక పాల్ వారిని ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ, కళ్యాణ్ బెనర్జీ, మహ్మద్ జావేద్, ఎ రాజా, నసీర్ హుస్సేన్, మొహిబుల్లా, మహ్మద్ అబ్దుల్లా, అరవింద్ సావంత్, నదీమ్-ఉల్ హక్, ఇమ్రాన్ మసూద్ సస్పెండ్ చేసిన సభ్యులు. బీజేపీ సభ్యుడు నిషికాంత్ దూబే ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దానిని కమిటీ ఆమోదించింది.
బీజేపీ సభ్యుడు అపరాజిత సారంగి మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన అసహ్యంగా ఉందని, వారు సమావేశంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు. పాల్‌కు వ్యతిరేకంగా అన్‌పార్లమెంటరీ భాషను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ముసాయిదా చట్టంలో ప్రతిపాదిత మార్పులను అధ్యయనం చేసేందుకు తమకు తగిన సమయం ఇవ్వడం లేదని విపక్ష సభ్యులు వాదించారు.