నమాజ్ సమయంలో దాడులు చేయలేదు..!
By - Medi Samrat |
'ఆపరేషన్ సింధూర్' దాడుల సమయాన్ని ఎలా ఎంచుకున్నారో వివరించారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' దాడులు కేవలం కచ్చితత్వంతో మాత్రమే కాకుండా ఎంతో అలోచించి సరైన సమయాన్ని ఎంచుకుని అమలు చేశామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. నమాజ్ సమయంలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయకుండా సాయుధ బలగాలు ఉద్దేశపూర్వకంగానే నివారించాయని ఆయన వెల్లడించారు. బెంగళూరులో జరిగిన 'రణ్ సంవాద్' ఫోరమ్‌లో ద్వివేది మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ ఉగ్ర శిబిరాల్లో ఉన్న వారు నమాజ్ చేసుకునే సమయంలో దాడులు చేయకుండా ఉండేలా తాము జాగ్రత్త పడ్డామని ఆర్మీ చీఫ్ చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పర్యాటకులపై చేసిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని గతేడాది మే నెలలో భారత సైన్యం మిలటరీ ఆపరేషన్‌ను చేపట్టింది. మే 10, 2025 నుంచి అన్ని సైనిక చర్యలను (భూ, వాయు, సముద్ర మార్గాల్లో) నిలిపివేసేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి.