అత్యాచార నిర్ధారణకు ఆ ప‌రీక్ష చేయ‌డం అమానవీయం : సుప్రీంకోర్టు

Anyone conducting 2-finger test on rape survivor will be held guilty of misconduct. అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్షపై సుప్రీంకోర్టు సోమవారం నాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

By Medi Samrat  Published on  31 Oct 2022 11:56 AM GMT
అత్యాచార నిర్ధారణకు ఆ ప‌రీక్ష చేయ‌డం అమానవీయం : సుప్రీంకోర్టు

అత్యాచార బాధితులను పరీక్షించేందుకు రెండు వేళ్ల పరీక్ష (two-fingers test) పై సుప్రీంకోర్టు సోమవారం నాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే రెండు వేళ్ల పరీక్ష జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అత్యాచారం మరియు లైంగిక వేధింపులను గుర్తించడానికి "రెండు వేళ్ల" పరీక్షను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలాంటి పరీక్షలు నిర్వహించే వ్యక్తులపై చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది.

న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ఓ వ్యక్తిని జార్ఖాండ్ హైకోర్టు నిర్దోషిగా విడిచిపెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని డివిజన్ బెంచ్ తోసిపుచ్చుతూ, దోషిగా నిర్ధారించిన ట్రయిల్ కోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఈ సందర్భంగా, రెండు వేళ్ల పరీక్షలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యాచార నిర్ధారణకు వైద్యులు 'రెండు వేళ్ల' పరీక్షను నిర్వహించడం అత్యంత అమానవీయమని, ఈ పరీక్ష బాధితుల గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమని పేర్కొంటూ 2013 మేలో సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ విషయాన్ని న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం ప్రస్తావిస్తూ, ఇప్పటికీ సమాజంలో ఏదో ఒక చోట ఇలాంటివి చోటుచేసుకుంటుండటం దురదృష్టకరమని పేర్కొంది. టు ఫింగర్స్ టెస్ట్ జరక్కుండా చూడాలంటూ ఆయా రాష్ట్రాల డీజీపీలు, హెల్త్ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టుగా నిర్ధారించి, వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపింది.


Next Story