భారత్-పాకిస్తాన్ బోర్డర్ లో రెండో రోజు కూడా భూకంపం

Another earthquake jolts Rajasthan's Bikaner, measuring 4.8 on Richter scale. రాజస్థాన్‌లోని బికనీర్‌లో వరుసగా రెండో రోజు భూకంపం

By Medi Samrat  Published on  22 July 2021 11:21 AM IST
భారత్-పాకిస్తాన్ బోర్డర్ లో రెండో రోజు కూడా భూకంపం

రాజస్థాన్‌లోని బికనీర్‌లో వరుసగా రెండో రోజు భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 7.42 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 4.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు ఏమీ అందలేదని తెలిపింది. రాజస్థాన్‌కు సమీపంలో ఉన్న పాక్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. బికనీర్‌కు పశ్చిమ-వాయువ్య దిశలో 343 కిలోమీటర్ల దూరంలో.. జోధ్‌పూర్‌కు వాయువ్యంగా 439 కిలోమీటర్ల దూరంలో, భూమికి 110 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు.

బుధవారం నాడు కూడా బికనీర్ లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 5.24 గంటలకు రాజస్థాన్‌లోని బికనీర్‌తో పాటు.. ఇతర ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయినట్లు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. కొన్ని సెకన్ల వ్యవధిపాటు భూమి కంపించింది. భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం రాజస్థాన్ లోని బికనీర్ భూకంపానికి కేంద్రంగా ఉంది. ఉపరితలం నుంచి 110 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల భూమి కంపించినట్లు వివరించింది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది బికనీర్ అనే విషయం తెలిసిందే..!


Next Story