ఉత్తరప్రదేశ్‌లో ఐటీ దాడుల కలకలం.. కేంద్ర ప్రభుత్వంపై అఖిలేష్ యాదవ్ ఫైర్
Akhilesh Yadav slams BJP's intimidation tactics as IT dept raids SP leader . ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శనివారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నాయకులు, మద్దతుదారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.
By అంజి Published on 18 Dec 2021 1:06 PM ISTఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శనివారం సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నాయకులు, మద్దతుదారుల ఇళ్లపై ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. కాగా ఐటీ దాడులపై పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అధికార బిజెపిపై విరుచుకుపడ్డారు, ప్రతిపక్షాలను భయపెట్టడానికి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. 'కాంగ్రెస్ బాటలోనే బీజేపీ వెళుతోంది. కాంగ్రెస్ పాత చరిత్రను ఒకసారి చూడండి.. ఎవరినైనా బెదిరించాల్సి వచ్చినప్పుడల్లా ఈ కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటుంది. నేడు బీజేపీ కూడా అదే చేస్తోంది' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్షాల పక్షాలపై కావాలనే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోందని యూపీ మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
"బీజేపీకి ఓటమి భయం పెరిగిన కొద్దీ, ప్రతిపక్షాలపై దాడులు కూడా పెరుగుతాయి. అయితే సమాజ్ వాద్ పార్టీ రథయాత్ర,ఇతర ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది" అని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో "రామరాజ్యం" తెస్తామని ఎన్నికల హామీని నెరవేర్చడంలో కాషాయ పార్టీ విఫలమైందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. రామరాజ్యం తెస్తామని బీజేపీ చెబుతోందని, కానీ సోషలిజం మార్గం రామరాజ్యాన్ని తెస్తుందని, సోషలిజం వస్తే రామరాజ్యం వస్తుందని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని మౌలో ఎస్పీ జాతీయ కార్యదర్శి, అధికార ప్రతినిధి రాజీవ్‌రాయ్ నివాసంలో శనివారం ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. వారణాసి నుండి ఐటీ అధికారుల బృందం శనివారం ఉదయం మౌ చేరుకుంది. సహదత్‌పురా ప్రాంతంలోని రాయ్ ఇంటిలో ఉదయం 7 గంటలకు సోదాలు ప్రారంభించింది. ఎస్పీ నాయకుడు, అతని కుటుంబం గత రెండు గంటలుగా ఇంట్లోనే బంధించబడ్డారు. దాడుల గురించి తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు రాయ్ నివాసం వెలుపల గుమిగూడి ఆందోళనకు దిగారు. శాంతిభద్రతల పరిరక్షణకు, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులను నియమించారు. రాజీవ్ రాయ్‌పై ఐటీ దాడులు పన్ను ఎగవేతపై అనుమానాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
మెయిన్‌పురిలోని ఆర్‌సిఎల్ గ్రూప్ యజమాని మనోజ్ యాదవ్, లక్నోలోని జైనేంద్ర యాదవ్‌కు చెందిన ప్రాంగణాల్లో కూడా ఐటి శాఖ దాడులు నిర్వహిస్తోంది. వీరిద్దరూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు సన్నిహితులు. మెయిన్‌పురిలో ఐటీ అధికారులు 12 వాహనాల కాన్వాయ్‌లో వచ్చి మనోజ్ యాదవ్ నివాసాన్ని సీజ్ చేశారు. లక్నోలోని అంబేద్కర్ పార్క్ ప్రాంతంలో జైనేంద్ర యాదవ్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.