సరిహద్దుల్లో హై అలర్ట్.. అక్కడికి వెళ్లే విమాన సర్వీసులు, ట్రైన్స్ రద్దు

బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) హై అలర్ట్ ప్రకటించింది.

By Medi Samrat  Published on  5 Aug 2024 7:00 PM IST
సరిహద్దుల్లో హై అలర్ట్.. అక్కడికి వెళ్లే విమాన సర్వీసులు, ట్రైన్స్ రద్దు

బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) హై అలర్ట్ ప్రకటించింది. సోమవారం 4,096 కి.మీల భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాలలోనూ "హై అలర్ట్" జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ దేశంలో జరుగుతున్న అల్లర్ల దృష్ట్యా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచిపెట్టింది. ఆమె విమానం సోమవారం సాయంత్రం 5:36 గంటలకు భారతదేశంలో ల్యాండ్ అయింది. ఆమె విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగింది.

ఢాకాలోని ఆమె అధికారిక నివాసం గణభబన్‌ను వేలాది మంది నిరసనకారులు ముట్టడించగా.. హసీనా (76) మరియు ఆమె సోదరి షేక్ రెహానా సురక్షిత ప్రదేశం కోసం బయలుదేరి చివరికి భారత్ లో దిగారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి వెళ్లే అన్ని విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. కోల్‌కతా-ఢాకా-కోల్‌కతా మైత్రీ ఎక్స్‌ప్రెస్ సేవలు రద్దు చేశామని తూర్పు రైల్వే తెలిపింది. హింసాత్మక నిరసనల కారణంగా జులై 21 నుండి రెండు-వారాలకు ఒకసారి నడిచే కోల్‌కతా-ఖుల్నా-కోల్‌కతా బంధన్ ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలను కూడా రద్దు చేశారు.

Next Story