భారత్‌లో విమానాల తయారీకి లైన్ క్లియర్..అదానీతో ఎంబ్రియర్ ఒప్పందం

భారతదేశంలో విమానాల తయారీ దిశగా మరో కీలక అడుగు పడింది.

By -  Knakam Karthik
Published on : 27 Jan 2026 1:15 PM IST

National News, Delhi, Central Government, India, Aircraft manufacturing, Adani Aerospace, Embraer

భారత్‌లో విమానాల తయారీకి లైన్ క్లియర్..అదానీతో ఎంబ్రియర్ ఒప్పందం

న్యూఢిల్లీ: భారతదేశంలో విమానాల తయారీ దిశగా మరో కీలక అడుగు పడింది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రియర్ (Embraer), భారతదేశంలోని అదాని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సంస్థతో కలిసి దేశంలోనే విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎంఓయు (MoU) కుదుర్చుకుంది. ఈ ఒప్పందానికి కేంద్ర పౌర విమానయాన శాఖ పూర్తి మద్దతు అందించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో 80 నుంచి 150 సీట్ల సామర్థ్యం కలిగిన రీజినల్, డొమెస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి మార్గం సుగమం కానుంది. ముఖ్యంగా టియర్-2, టియర్-3 నగరాల మధ్య పెరుగుతున్న విమాన ప్రయాణ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాలు కీలక పాత్ర పోషించనున్నాయి. భారత్‌లో రోజుకు సుమారు 5 లక్షల మంది విమాన ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున విమానాలను దిగుమతి చేసుకుంటున్న భారత్, ఈ ఒప్పందంతో ధర, సమయం, ఉపాధి పరంగా భారీ లాభాలు పొందుతుందని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా విధానాల ఫలితంగానే అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. రానున్న కాలంలో భారత్‌లోనే అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయాలని కూడా ఇరు సంస్థలు నిర్ణయించాయి. వచ్చే నెలలో బ్రెజిల్ అధ్యక్షుడు భారత్‌కి వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి ఈ ప్రాజెక్టుపై మరిన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశముందని తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో జరుగుతున్న వింగ్స్ ఇండియా షోలో ఎంబ్రియర్ విమానాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్ కేవలం దేశీయ అవసరాలకే కాకుండా, భవిష్యత్తులో ఎయిర్‌క్రాఫ్ట్ ఎగుమతుల కేంద్రంగా కూడా మారే అవకాశముందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story