నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్రం నియమించింది. ఆమెతోపాటు మమతా కుమారి, టెలీనా కంగ్ డోబ్ లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్లు వీరు పదవిలో కొనసాగుతారు. ఎన్‌సిడబ్ల్యు డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడేళ్ల కాలానికి లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు.. ఏది ముందుగా ఉంటే అప్పటి వరకు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్‌సిడబ్ల్యు సభ్యుని పదవికి నామినేట్ అయినందుకు ఖుష్బును తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ట్వీట్‌లో అభినందించారు.
దక్షిణాదిలో నటిగా పాపులర్ అయిన ఖుష్బూ 2010లో డీఎంకే పార్టీలో చేరారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2020 దాకా కాంగ్రెస్ లో అధికార ప్రతినిధిగా సేవలందించారు. తర్వాత ఖుష్బూ బీజేపీలో చేరారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కుష్బూ ధన్యవాదాలు తెలిపారు.