ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ నుంచి వచ్చిన అత్యాచార నిందితుడు.. శనివారం ఫరీదాబాద్‌లోని కోర్టు ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సూరజ్ (21) తన భార్యతో కలిసి ఘజియాబాద్ (యూపీ)లోని ఖోడా కాలనీలో నివసిస్తున్నాడు. సూరజ్ ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. జూన్ 15, 2021న అతడు ఓ యువతిని తీసుకుని పారిపోయాడు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో అమ్మాయితో కలిసి పారిపోయినందుకు ఖేరీ బ్రిడ్జ్ పోలీస్ స్టేషన్‌లో సూరజ్‌పై కేసు నమోదైంది. జూన్ 24న పోలీసులు సూరజ్‌ను అరెస్టు చేశారు. యువకుడి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టంలోని సెక్షన్‌ను కూడా చేర్చారు. దాదాపు నెలన్నర తర్వాత బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు.
జైలు నుంచి వచ్చిన తర్వాత అతడు యువతిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అమ్మాయికి 18 ఏళ్లు నిండడంతో వివాహానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. పెళ్లయినప్పటి నుంచి సూరజ్ తల్లిదండ్రులకు దూరంగా భార్యతో ఉంటున్నాడు. అడిషనల్ సెషన్స్ జడ్జి జాస్మిన్ శర్మ కోర్టులో అత్యాచారం కేసు నడుస్తోంది.శనివారం తల్లిదండ్రులతో కలిసి ఆరో అంతస్తులోని కోర్టుకు వెళ్లాడు. శాశ్వత బెయిల్‌పై వాదనలు జరగనున్నాయని అడ్వకేట్ షాహిద్ అలీ తెలిపారు. విచారణ అనంతరం సూరజ్ కోర్టు నుంచి బయటకు వచ్చి గ్యాలరీలోని దాదాపు నాలుగు అడుగుల ఎత్తున్న గోడపై నుంచి కిందకు దూకేసాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.