నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
By Medi Samrat Published on 15 Jan 2025 4:30 PM ISTఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి ప్రవేశ్ వర్మ, కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్‌లతో తలపడనున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు. అంతకుముందు 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందారు.
ఈ రోజు న్యూఢిల్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసినట్లు కేజ్రీవాల్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. గత 10 ఏళ్లు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన ప్రేమ, ఆశీర్వాదం నాకు పూర్తి అంకితభావంతో, సేవతో పని చేసే శక్తిని, స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ఢిల్లీ ప్రజలు ఈసారి కూడా పనిచేసే వారినే ఎంచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశ రాజధానిలోని 70 అసెంబ్లీ స్థానాల్లో న్యూ ఢిల్లీ సీటు అత్యంత ముఖ్యమైన స్థానాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 1993లో కీర్తి ఆజాద్ న్యూఢిల్లీ నుంచి బీజేపీ టికెట్‌పై గెలుపొందారు. ఆజాద్ ఇప్పుడు TMC ఎంపీ. షీలా దీక్షిత్ 1998, 2003, 2008లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. కేజ్రీవాల్ 2013లో షీలా దీక్షిత్‌పై 25 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. 2015లో బీజేపీ అభ్యర్థి నూపుర్ శర్మపై 31,000 ఓట్ల తేడాతో ఆయన మరోమారు విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో కేజ్రీవాల్ 21,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన సునీల్ యాదవ్‌ను ఓడించి ఢిల్లీ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ స్థానంలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ సుభర్వాల్‌కు కేవలం 3,220 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇదిలావుంటే.. వచ్చే ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితాలు కూడా వెలువడుతాయి.