ఎన్డీయే కూటమిలోని కీలక మిత్రపక్షాలైన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను బెదిరించి, తమ అదుపులో ఉంచుకోవడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.
తీవ్రమైన నేరారోపణల కింద అరెస్టయిన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు లేదా మంత్రులు 30 రోజుల్లోగా తమ పదవులకు రాజీనామా చేయాలని, లేదంటే వారిని తొలగించేలా ఈ బిల్లును రూపొందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూ మద్దతుతోనే కొనసాగుతోందని, భవిష్యత్తులో వారిని రాజకీయంగా బ్లాక్‌మెయిల్ చేసేందుకే ఈ బిల్లును ఒక ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను జైలుకు పంపారని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా చంద్రబాబు, నితీశ్ వంటి నేతలను కూడా బెదిరించాలని చూస్తున్నారని అన్నారు.