ఆమె అల్లుడికి చట్టబద్ధమైన ప్రతినిధి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు.!

A key judgment of the Supreme Court. అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

By అంజి  Published on  26 Oct 2021 10:50 AM IST
ఆమె అల్లుడికి చట్టబద్ధమైన ప్రతినిధి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు.!

అత్తను చట్టబద్ధ ప్రతినిధిగా పరిగణించలేమని కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అల్లుడికి అత్త చట్టప్రతినిధి అవుతుందని, మోటారు వాహనాల చట్టం కింద పరిహారం పొందేందుకు ఆమె అర్హురాలేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును చెప్పింది. భారత సమాజంలో అల్లుడు, కుమార్తెల వద్ద అత్త నివసించడం కొత్తేమీ కాదు, పోషణ కోసం వృద్ధాప్యంలో అల్లుడిపై అత్త ఆధారపడుతుంది. అత్త అల్లుడికి చట్టబద్ధమైన వారసురాలు కాకపోయినప్పటికీ.. అల్లుడు మరణిస్తే ఆమె తప్పకుండా ఇబ్బందులు పడుతుంది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 166 ప్రకారం ఆమె కూడా అల్లుడికి చట్టబద్ధమైన ప్రతినిధి అవుతుందని ధర్మాసనం తెలిపింది.

కేసు విషయం ఏమిటంటే.. కేరళలో 2011లో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అతడి కుటుంబానికి రూ.74,50,971 పరిహారం చెల్లించాలని బీమా కంపెనీకి మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ ఆదేశించింది. దీంతో సదరు బీమా కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. పరిహారాన్ని రూ.48,39,728కి తగ్గిస్తూ అత్తను చట్టబద్ధ ప్రతినిధి పరిగణించలేమని హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై మృతుడి భార్య సుప్రీంకోర్టుకు వెళ్లింది. మృతుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 52 ఏళ్ల వయస్సులో చనిపోయాడు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తంగా రూ.85,81,815 రూపాయలు చెల్లించాలని ఆదేశిస్తూ... అత్త కూడా పరిహారాని అర్హురాలేనని తెలిపింది.

Next Story