Earthquake : హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం.. వ‌ణికిన ఉత్త‌ర భార‌తం.. 9 మంది మృతి

ఆఫ్గానిస్థాన్ హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 6.6గా న‌మోదు అయ్యింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2023 3:40 AM GMT
Earthquake,Earthquake strikes Afghanistan

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ఆఫ్గానిస్థాన్ హిందూకుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్ పై 6.6గా న‌మోదు అయ్యింది. ఈ భూకంప ప్ర‌భావం పాకిస్థాన్ స‌హా ఉత్త‌ర భార‌త దేశంలోని ప‌లు ప్రాంతాల్లో క‌నిపించింది. పాకిస్థాన్ దేశంలో తొమ్మిది మంది మ‌ర‌ణించారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రాన్ని ఆఫ్ఘనిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్‌లో 180 కిలోమీటర్ల లోతులో గుర్తించారు.

మంగ‌ళ‌వారం రాత్రి 10.17 గంట‌ల స‌మ‌యంలో హిందూకుష్‌ పర్వతాల్లో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ప్రాణ నష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. వంద మందికిపైగా గాయపడ్డారని పాక్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ అధికార ప్రతినిధి బిలాల్‌ ఫైజీ చెప్పారు. గాయ‌ప‌డిన వారిని వివిధ ఆస్ప‌త్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఉత్త‌ర‌భార‌తదేశంలోనూ..

ఈ భూకంప ప్రభావం ఉత్తరభారతంలోనూ కనిపించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లో భూమి కంపించింది. ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లు, భవనాలు కదిలాయని, భయంతో రోడ్లపైకి పరుగులు పెట్టామని ప‌లువురు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భూకంపంపై స్పందిస్తూ, "ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను" అని ట్విట్టర్‌లో రాశారు.

Next Story