ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వ‌రుస‌ పేలుళ్లు.. 8 మంది ఉద్యోగులు దుర్మ‌ర‌ణం

మహారాష్ట్రలోని భండారాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుళ్ల ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  24 Jan 2025 2:45 PM IST
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వ‌రుస‌ పేలుళ్లు.. 8 మంది ఉద్యోగులు దుర్మ‌ర‌ణం

మహారాష్ట్రలోని భండారాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుళ్ల ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. శుక్ర‌వారం ఉద‌యం ఈ ప్రమాదం జరిగింది. సమాచారం ప్రకారం.. ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటి వ‌రుస‌ పేలుళ్లు జరిగాయి. ఇందులో ఇప్పటివరకు 8 మంది మరణించారు. శిథిలాల కింద ఉన్న ప‌లువురు ఉద్యోగుల కోసం అన్వేషణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిఫెన్స్ PRO ప్రకారం, నాగ్‌పూర్ నుంచి వ‌చ్చిన‌ రెస్క్యూ సహాయక చర్యలు చేట్ట‌గా, మెడికల్ టీమ్‌లు ప్రాణాలతో బయటపడిన వారికి చికిత్స అందిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.

జవహర్ నగర్ భండారా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన తరువాత అగ్నిమాపక దళం, అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయని భండారా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పైకప్పు ఉద్యోగుల‌పై కూలడంతో జేసీబీ సాయంతో శిథిలాల‌ను తొలగిస్తున్న‌ట్లు స‌మాచారం. శిథిలాల కింద ఉన్న ప‌లువురిని రక్షించినట్లు తెలుస్తుంది.

ఉదయం 10.30 గంటల ప్రాంతంలో కాంప్లెక్స్‌లో పేలుడు సంభవించిందని జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్టే తెలిపారు. జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలోని ఎల్‌టీపీ సెక్షన్‌లో పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు సంభవించిన సమయంలో సెక్షన్‌లో 14 నుంచి 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిలో ముగ్గురు సజీవంగా బ‌య‌ట‌ప‌డ్డారని.. 8 మంది మరణించారని అధికారి తెలిపారు.

Next Story