జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు గ్రనేడ్లతో జరిపిన దాడుల్లో ఆరుగురు పౌరులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. బందిపోరా సంబల్ బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ బస్టాండ్ సమీపంలోని ఆర్మీ కాన్వాయ్‌పై ఉదయం 10.20 గంటల సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
వారి లక్ష్యం తప్పిపోయి రోడ్డు పక్కన పేలింది. పేలుడు ధాటికి పలు వాహనాల అద్దాలు పగిలాయి. పేలుడుతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొన్నది. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఆదివారం షోపియాన్‌లోని జైనాపోరాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. అనంతరం సీఆర్‌పీఎఫ్ జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఒక కశ్మీరీ పౌరుడు మరణించాడు. మృతుడిని యాపిల్ పండ్ల వ్యాపారి షాహీద్ ఎజాజ్‌గా గుర్తించారు.