జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి సెక్టార్ లో అయిదుగురు జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. సోమవారం ఉదయం ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు వెళ్లిన సైనిక బృందంలోని జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తో పాటూ మరో నలుగురు సైనికులు మరణించారని సైనిక వర్గాలు తెలిపారు. పీర్ పంజాల్ రేంజ్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాన్ని తిప్పికొట్టే క్రమంలో సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. పూంచ్ జిల్లా సురాన్‌కొటే పరిధి డీకేజీ గ్రామాల్లో ఉగ్రవాదుల తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
ఈ సమయంలోనే ఉగ్రవాదులు కాల్పులకు జరపడంతో సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. దీంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు కూడా హతమైనట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో సామాన్యులపై కొందరు తీవ్రవాదులు దాడులు చేస్తూ వస్తున్నారు. దీంతో అలాంటి వారిని ఏరి పారేయడమే లక్ష్యంగా పెట్టుకుని భారత సైన్యం ముందుకు వెళుతూ ఉండగా.. ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. భారత సైన్యం చేతిలో ఎంత మంది తీవ్రవాదులు చనిపోయారో తెలియాల్సి ఉంది.