కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో 40 మంది విద్యార్థులను ఐసోలేషన్‌లో ఉంచారు. విద్యార్థులకు గురువారం ఆర్‌టి-పిసిఆర్ పరీక్షలు నిర్వహించగా శుక్రవారం ఫలితాలు రావాల్సి ఉంది. ఫిజియోథెరపీ బోధించే ఈ కళాశాలలో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు జాతీయ సదస్సు నిర్వహించగా.. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
ఈ సెమినార్ తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, కళాశాలలోని కొంత భాగాన్ని ఐసోలేషన్ వార్డుగా మార్చి విద్యార్థులను అక్కడే ఉంచారని కళాశాల వర్గాలు తెలిపాయి. జనరల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడంతో సహా తదుపరి చర్య కోసం కళాశాల అధికారులు.. గురువారం చేసిన RT-PCR పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు స్వల్పంగా పెరిగే సంకేతాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ కఠినమైన కోవిడ్-19 స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం మాస్క్‌లను తప్పనిసరి చేసింది. నిబంధనలు పాటించనివారికి 500 రూపాయల జరిమానా విధించనున్నట్లు హెచ్చరించింది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జె. రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. కోయంబత్తూరు కళాశాల విద్యార్థులకు జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తున్నాయని మాకు తెలిసింది. RT-PCR పరీక్ష పూర్తయింది. ఫలితాల కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రామాణిక కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించడంతోపాటు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.