నలుగురు 'సుప్రీం' న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్.. 150 మంది సిబ్బంది క్వారంటైన్
4 Supreme Court Judges Test Positive, Over 150 Staff In Quarantine. సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని
By Medi Samrat Published on 9 Jan 2022 3:40 PM ISTసుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. 150 మంది సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మొత్తం 32 మంది న్యాయమూర్తుల సిబ్బందిలో నలుగురికి కరోనా సోకడంతో కోర్టులో పాజిటివిటీ రేటు 12.5 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఇద్దరు న్యాయమూర్తులకు గురువారం పాజిటివ్ గా తేలింది. సుప్రీంకోర్టు వర్గాల సమాచారం ప్రకారం.. జ్వరంతో బాధపడుతున్న న్యాయమూర్తి మంగళవారం జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి వీడ్కోలు పార్టీకి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయనకు కోవిడ్ రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని ప్రముఖ వార్తా సంస్థ ఎన్డీ టీవీ పేర్కొంది.
కరోనా పరిస్థితిపై గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, మరో నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సమావేశమయ్యారు. "దురదృష్టవశాత్తూ, మళ్లీ సమస్య మొదలైంది. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. వచ్చే నాలుగు నుండి ఆరు వారాలలో ఫిజికల్ మోడ్ ద్వారా కేసులు నమోదవకపోవచ్చని అని సిజెఐ చెప్పారు. ఒమిక్రాన్ నేపథ్యంలో దేశంలో కేసులు అధికంగా నమోదవుతున్న వేళ.. సుప్రీంకోర్టు రెండు వారాల పాటు వర్చువల్ విచారణలకు మారింది. ఈ మేరకు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. జనవరి 7 నుండి ఈ నిర్ణయం అమలులోకి రాగా.. న్యాయమూర్తులు నివాస కార్యాలయాల వద్ద నుంచే వర్చువల్ విచారణలలో పాల్గొంటున్నారు.
అత్యంత అవసరమైన అంశాలు, తాజా విషయాలు, బెయిల్ వ్యవహారాలు, స్టే, డిటెన్షన్ వ్యవహారాలు, నిర్ణీత తేదీ వ్యవహారాలు జనవరి 10 నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కోర్టుల ముందు జాబితా చేయబడతాయని సర్క్యులర్‌లో పేర్కొంది. ఇదిలావుంటే.. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 2020 నుండి కొద్ది నెలల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు కేసులను విచారించింది. దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో అదే అక్టోబర్ నుండి భౌతిక విచారణలకు మారింది. ఇక దేశంలో ఈ రోజు 1,59,632 కొత్త కరోనావైరస్ కేసులు నమోదుకాగా.. గత 24 గంటల్లో 327 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 5,90,611 ఉండగా.. పాజిటివిటీ రేటు 10.21 శాతంగా ఉంది.