మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పొగాకు (గుట్కా) ఉమ్మివేసినందుకు నలుగురు పోలీసు సిబ్బందిని అరెస్టు చేశారు. షాహ్‌దోల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ముఖేష్ వైశ్య మాట్లాడుతూ, "హెచ్చరిక ఇచ్చినప్పటికీ, పోలీస్ స్టేషన్ ఆవరణలో నలుగురు పోలీసు సిబ్బంది అయిన సబ్ ఇన్‌స్పెక్టర్ నంద్ కుమార్ కచ్వాహా, అదనపు సబ్ ఇన్‌స్పెక్టర్ దినేష్ ద్వివేది, ASI దేవేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుల్ ప్యారే లాల్ పొగాకు ఉమ్మివేశారు. క్రమశిక్షణారాహిత్యం, పోలీస్‌స్టేషన్ ఆవరణలో అపరిశుభ్రత వ్యాప్తి చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశామని" ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
గుట్కా తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పొగాకు, నికోటిన్ మరియు ఇతర నమిలే పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, రవాణాను నిషేధిస్తూ ఇప్పటికే పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. అలాంటప్పుడు ఇలా పోలీసులే గుట్కాలను నములుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తుంటే ఉన్నతాధికారులకు కోపం వచ్చింది. దీంతో ఏకంగా అరెస్ట్ దాకా చర్యలు తీసుకున్నారు. ఎన్నో శాస్త్రీయ నివేదికలు గుట్కా నమలడం వల్ల అత్యంత హానికరమైన ప్రభావాలు కలుగుతాయని వివరించాయి. అయినా కూడా కొందరు ఆ పనిని మనలేకపోతున్నారు.