జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందిన 34 మంది ఆ ప్రాంతంలో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం పార్లమెంటులో తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ బయటి నుండి 34 మంది వ్యక్తులు జమ్మూ, రియాసి, ఉధంపూర్, గందర్‌బల్ జిల్లాలో ఆస్తులను కొనుగోలు చేశారని లిఖితపూర్వకంగా.. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు హాజీ ఫజ్లూర్ రెహ్మాన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పటిష్టమైన భద్రత, ఇంటెలిజెన్స్ గ్రిడ్ అమల్లో ఉందని రాయ్ సభకు చెప్పారు.
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులను అడ్డుకోవడానికి నాకాస్, రోడ్ ఓపెనింగ్ పార్టీలలో 24 గంటలూ చెకింగ్ లను నిర్వహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యూహాత్మక పాయింట్ల వద్ద భద్రతను మరింత పెంచామని రాయ్ అన్నారు. డిసెంబర్ 2021లో, జమ్మూ కశ్మీర్ వెలుపలి నుండి ఇద్దరు వ్యక్తులు, ఆగస్టు 2019 సమయంలో ఒక ఆస్తిని కొనుగోలు చేశారని కేంద్రం పార్లమెంటుకు గతంలో తెలిపింది. అక్టోబర్ 2020లో, జమ్మూ కశ్మీర్ లో వ్యవసాయేతర భూములు కొనుగోలు చేయడానికి భారతీయ పౌరులకు అనుమతిస్తూ కొత్త భూ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది.