రాజస్థాన్‌లోని సికార్‌లోని ఖతు శ్యామ్‌జీ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం జైపూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆలయ ముఖద్వారం వద్ద ఉదయం 5 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. చాంద్రమానంలోని 11వ రోజు, శ్రీకృష్ణుడి అవతారంగా విశ్వసించబడే ఖతు శ్యామ్ జీ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేకువజామున 5 గంటల ప్రాంతంలో ఆలయ ద్వారాలు తెరుచుకోగానే అప్పటికే వేచి చూస్తున్న వందలాదిమంది భక్తులు ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్‌జీ భక్తులైన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు ఒకరిని మాత్రమే గుర్తించారు.
విషయం తెలిసిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడి బయటి గేట్లు తెరిచే వరకు వేచి ఉన్నారు. గేట్లు తెరిచి, లోపలికి నెట్టడానికి ప్రయత్నించిన వెంటనే, ఒక మహిళ స్పృహతప్పి పడిపోయింది. ఆ సమయంలో ఆమె వెనుక ఉన్న ఇతరులు కూడా పడిపోయారు. అనంతరం జరిగిన గందరగోళంలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల బృందం వెంటనే ఆలయానికి చేరుకుని జనాన్ని అదుపు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.