20 మంది ప్రాణాలు తీసిన పిడుగులు
అకాల వర్షాల కారణంగా గుజరాత్‌లో పిడుగుపాటుకు గురై 20 మంది మరణించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Nov 2023 1:06 PM ISTఅకాల వర్షాల కారణంగా గుజరాత్‌లో పిడుగుపాటుకు గురై 20 మంది మరణించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) ప్రకారం, గుజరాత్‌లోని వివిధ జిల్లాల నుండి మొత్తం 20 మంది మరణించారు. ఆదివారం రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల సమయంలో పిడుగుపాటుకు గురై ఈ మరణాలు సంభవించాయి. SEOC అధికారి ప్రకారం.. దాహోద్‌లో నలుగురు, బరూచ్‌లో ముగ్గురు, తాపీలో ఇద్దరు, అహ్మదాబాద్, అమ్రేలి, బనస్కాంత, బోటాడ్, ఖేడా, మెహసానా, పంచమహల్, సబర్‌కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారక జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఈ మరణాలపై సంతాపాన్ని వ్యక్తం చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, స్థానిక యంత్రాంగం సహాయక చర్యలలో చురుకుగా నిమగ్నమై ఉందని హామీ ఇచ్చారు.
"గుజరాత్‌లోని వివిధ నగరాల్లో పిడుగుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారనే విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.. ప్రభుత్వం ఆదుకుంటుంది" అని షా X లో పోస్ట్ చేశారు. SEOC డేటా ప్రకారం, గుజరాత్‌లోని సూరత్, సురేంద్రనగర్, ఖేడా, తాపీ, భరూచ్, అమ్రేలి జిల్లాల్లో 16 గంటల్లో 50-117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.