జమ్మూకశ్మీర్‌లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భారత భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపాయి. జమ్మూలోని షోపియన్ జిల్లా డ్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీసులు చెప్పారు. ఇద్దరు చంపబడ్డారని.. మరణించిన ఉగ్రవాదుల గుర్తింపు, వారు ఏ సంస్థతో పని చేస్తున్నారో నిర్ధారించబడుతోందని అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా అమాయక వలసకూలీలను టార్గెట్‌గా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు తీవ్రవాదులు. భారత బలగాలు తీవ్రవాదులను మట్టుబెట్టే లక్ష్యంగా ఆపరేషన్ ను మొదలు పెట్టాయి. కశ్మీర్ లో గత కొద్ది రోజులుగా మైనార్టీలైన హిందువులు,సిక్కులతో పాటు స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్నారు. గడచిన రెండు వారాల్లో శ్రీనగర్ సహా కశ్మీర్ లో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఇప్పటి వరకూ 11 మంది పౌరులు హత్యకు గురయ్యారు. మృతుల్లో స్థానికేతరులు ఐదుగురు ఉన్నారు. పౌరుల వరుస హత్యలపై NIA(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.