కర్ణాటకలోని కోస్తా పట్టణం ఉడిపిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. మే 18 రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గ్యాంగ్ వార్‌లో ఆరుగురు వ్యక్తలు ఉన్నట్లు వీడియో ద్వారా తెలుస్తుంది. వీరిలో ఇద్దరిని అరెస్టు చేశామని.. నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆర్థిక తగాదాల కారణంగానే గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.
గొడవ జరిగిన రహదారికి సమీపంలో ఉన్న ఎత్తైన భవనంలో నివాసం ఉంటున్న వ్యక్తి తీసిన వీడియోలో.. రెండు మారుతీ స్విఫ్ట్ కార్లను ఈ వార్‌లో వాడినట్లుగా స్పష్టమవుతుంది. అందులో ఒక కారు స్పీడ్‌లో రివర్స్ గా వచ్చి మరో కారు బానెట్‌ను ఢీకొట్టింది. దీంతో నల్లటి పొగ వెలువడింది. కొద్దిసేపటికే రెండు కార్లలోని వ్యక్తులు దిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఈ గొడవలో ఓ కారు.. కర్ర పట్టుకుని ఉన్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు గాయపడి నేలపై కుప్పకూలిపోయాడు.
ఓ కర్ణాటక వైద్యుడు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. "చాలా దారుణమైన పరిస్థితి. ఉడిపిలో గ్యాంగ్ వార్. ఇటీవల అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది, కుంజిబెట్టు సమీపంలో ఉడిపి-మణిపాల్ హైవేపై రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి. ఈ యువ తరం ఎక్కడికి వెళుతోంది? ఈ దోషులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఆర్థోపెడిక్ సర్జన్ డా. దుర్గాప్రసాద్ హెగ్డే పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. పరారీలో ఉన్న నలుగురి కోసం గాలింపు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.