170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన

మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

By -  Medi Samrat
Published on : 16 Oct 2025 9:10 PM IST

170 మంది మావోయిస్టులు లొంగుబాటు.. అమిత్ షా కీలక ప్రకటన

మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. గురువారం చత్తీస్‌గఢ్‌లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని ఆయన తెలిపారు.మల్లోజుల టీమ్‌ లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆశన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం గమనార్హం.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న స్వస్థలం ప్రస్తుత ములుగు జిల్లా జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని నర్సింగాపూర్‌. చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. ఆశన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. ఆయన మొదట కాకతీయ యూనివర్సిటీలో సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ అనుబంధ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌కు నాయకత్వం వహించారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఐపీఎస్‌ ఉమేష్‌చంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఆశన్న పాత్ర ఉందని చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అప్పటి సీఎం చంద్రబాబునాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కూడా ఆశన్నదే కీలకపాత్ర. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాల్లో ప్రచార విషయాల్లో ఆశన్ననే కీలకంగా వ్యవహరిస్తారు. 2024 నవంబరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆశన్న మరణించినట్టు వదంతులు వ్యాపించాయి. కానీ, ఆ తర్వాత ఆయన బతికే ఉన్నాడని తేలింది. ప్రస్తుతం ఆశన్న వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది.

ఆశన్న లొంగు బాటు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షావెల్లడించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. నిన్న ఛత్తీస్‌గఢ్‌లో 27మంది; మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ రోజు 170 మంది లొంగిపోయారు. దీంతో రెండు రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై పోరులో ఇదో పెద్ద విజయమన్నారు.

Next Story